తన బ్లాక్ అండ్ వైట్ పుస్తకంలోని ఈ వ్యాసాన్ని ఇక్కడ ప్రచురించుకునేందుకు అనుమతి ఇచ్చిన శ్రీ రావి కొండలరావు గారికి శతకోటి హృదయ పూర్వక కృతజ్ఞతాభివందనాలతో...

వెన్నెలకే వన్నెలు తెచ్చిన " తెర చంద్రుడు "

పున్నమిచంద్రుడు వినీలాకాశంలో వెలిగి, వెన్నెల కురిపిస్తే మార్కస్ బార్ట్లీ, సినీలాకాశంలో తెరమీద " పిండారబోసినట్టు " దీపాలతో వెన్నెల సృష్టించి, ప్రేక్షకుల మీద కురిపించాడు. వెన్నెల పాటల్లోని, ఆ వెన్నెల థియేటర్లోని ప్రేక్షకుల ముఖాల మీద ప్రతిఫలించేది. బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో, ముఖ్యంగా " విజయా " చిత్రాల్లో ఛాయాగ్రహణ దర్శకుడు మార్కస్ బార్ట్లీ చూపించిన వెన్నెల, సహజమయిన వెన్నెలని మించిపోయింది. అందుకే ఆ రోజుల్లోని రసజ్ఞులు ఆకాశం మీద పూర్ణచంద్రుణ్ణి చూసినప్పుడు " ఇవాళ చంద్రుడు విజయా వారి చంద్రుడిలా వున్నాడు " అని ' తిరగవేసి ' చెప్పుకునేవారు. సంబంధం వున్నా లేకపోయినా, పాట, అదీ ప్రేమ గీతం అయితే - చందమామ, వెన్నెలా విధిగా ఉండవలసిందే. అది అసహజం కాదు, కృత్రిమం కాదు, ఆహ్లాదం కోసం, ఆనందం కోసం. పాట వింటున్నప్పుడు ఆ మాధుర్యాన్ని ఎలా ఆస్వాదిస్తామో, ఆ దృశ్యాన్ని కూడా అంత హాయిగా అనుభవించాలి. పాటని చీకట్లో చిత్రీకరిస్తే ? - ఆనాటి చాలా చిత్రాల్లో చందమామ పాట ఒకటైనా వుండితీరాలి. సుఖం వచ్చినా, కష్టం వచ్చినా, ప్రేయసీ ప్రియులు చెప్పుకునేది ఆ చందమామతోనే. ఎన్నో ఎన్నెన్నో, మధురాతి మధుర గీతాలు చందమామతో పెనవేసుకున్నవే. ఆ " తెర చందమామ " సృష్టికర్త బార్ట్లీ ఆంగ్లో - ఇండియన్ అయినా, పురాణ కథాచిత్రం అయితే, పూర్తిగా తెలుసుకుని అవగాహన చేసుకునేవారు. పాత్రల గురించి తెలుసుకుని, తగ్గట్టు లైటింగ్ చేసేవారు. " మాయాబజార్ " లో శకుని మొదటిసారిగా కనిపించినప్పుడు చేసిన లైటింగ్ చిన్న ఉదాహరణ. చిన్నతనం నుంచి ఫొటోగ్రఫీ మీద అభిలాష పెంచుకుని, " ప్రెస్స్ ఫోటోగ్రాఫర్ " స్థాయికి ఎదిగి, బొంబాయిలో " టైంస్ ఆఫ్ ఇండియా " పత్రికకి పనిచేస్తూ సినిమెటోగ్రఫీ గురించి అభ్యసించి, అధ్యయనం చేసి - బ్రిటిష్ మూవీటోన్ (ఇండియా)లో " న్యూస్ రీల్ కెమెరామాన్" గా పనిచేసారు బార్ట్లీ. దేశవిదేశచిత్రాలు పరిశీలిస్తూ " లైటింగ్ " లోని భిన్నత్వాన్ని అనుశీలిస్తూ, అనుసరిస్తూ ప్రయోగాలు చేసుకున్నారు. బార్ట్లీలోని ఉత్సాహాన్నీ, ప్రజ్ఞాప్రాభవాన్నీ చూసి ప్రగతి పిక్చర్స్ వారు కథా చిత్రం ఇచ్చారు. 1941లో వచ్చిన ఆ తమిళ చిత్రం " తిరువళ్ళువర్ " మార్కస్ బార్ట్లీ తొలిచిత్రం. అప్పట్నుంచి మద్రాసులో స్థిరపడి - మరి రెండు తమిళచిత్రాలు చిత్రీకరించి, 1944లో " వాహినీ " దృష్టిలో పడ్డారు. చిత్రీకరణలో నూతనత్వాన్నీ, లైటింగ్లో దృశ్యభావ వ్యక్తీకరణనీ సాధించిన ఫోటోగ్రాఫర్గా బార్ట్లీకి ప్రశంసలందాయి. క్లోజప్స్ లో కూడా ఆయన వెలుగునీడలు చూపారు. " స్వర్గసీమ " చిత్రంలో ఒక రాత్రి దృశ్యంలో జయమ్మ నాగయ్యతో మాట్లాడుతున్నప్పుడు ఆమె క్లోజప్ ముఖం మీద, చెట్ల ఆకుల నీడలు కదలాడుతూ వుంటాయి. " ఆ టెక్నిక్ అప్పుడు కొత్త " అని, ప్రసిద్ధ ఛాయాగ్రాహకుడు అన్నయ్య చెబుతూ వుండేవారు. అలాగే " స్వర్గసీమ " లోని చివరి దృశ్యంలో నాగయ్య - రాత్రి వేళ రోడ్డు మీద నడిచినప్పుడు - ఆయన నీడ, ఇంటి గుమ్మంలోని లాంతరు వెలుగు బయట కనిపించడం వంటి లైటింగ్ ఎఫెక్ట్స్ కళాత్మకం. " ఓహోహో పావురమా " పాటలో భానుమతినీ, ఆ దృశ్యాన్నీ చిత్రీకరించిన తీరుకూడా, బార్ట్లీ భావుకతని స్పష్టీకరిస్తుంది.

" స్వర్గసీమ " తర్వాత బార్ట్లీకి " ఆఫర్లు " ఎక్కువగానే వచ్చాయి. కాని, ఇంకొక చిత్రంతో " క్లాష్ " రాకుండా వుండాలని ఎక్కువగా ఒప్పుకోలేదు. రెండుమూడు సినిమాలు ఏకకాలంలో ఒప్పుకుని, అసిస్టెంటులకి అప్పజెప్పి అటూ ఇటూ తిరగడం - బార్ట్లీకి చేతకాని పని. ఏ షాటు తీసినా ఆయనే చెయ్యాలి.

వాహినికి " యోగి వేమన (47) , గుణసుందరి కథా (49) లకు పనిచేసి, విజయ సమస్థలో చేరారు బార్ట్లీ. ఒక పక్క లైటింగ్లోనూ, షాట్స్ తియ్యడంలోనూ కొత్తదనం చూపిస్తూ, ఇంకోపక్క ట్రిక్ ఫోటోగ్రఫీ కూడా నేర్చుకోసాగారు. చిత్రాల్నీ, గ్రంథాల్నీ అధ్యయనం చేస్తూ ప్రయోగాలు చెయ్యసాగారు. " యోగివేమన " లోని ట్రిక్ షాట్సు, వేమన రాతి తిన్నె మీద వర్షంలో కూచుని వుండగా, ఆయన మేరకు వర్షం పడకుండా వుండడం - చెప్పుకోదగ్గవి. చివరి దృశ్యంలోని లైటింగ్ కూడా చిత్రం గుర్తున్నవారికి గుర్తుంటుంది.

" షావుకారు(50), పాతాళ భైరవి(51), పెళ్ళిచేసి చూడు(52), చంద్రహారం(54), మిస్సమ్మ(55), మాయాబజార్(57), జగదేకవీరుని కథ(61), గుండమ్మ కథ(62) మొదలైనవి విజయా చిత్రాలు బార్ట్లీకి విశేషమయిన పేరు తెచ్చిన చిత్రాలు. అలాగే ఆ చిత్రాలు కూడా బార్ట్లీ వల్ల గొప్ప పేరు తెచ్చుకున్నాయి.

" ఆయన చాలా స్ట్రిక్టు. అంచేతనే బయటి నిర్మాతలు ఆయన్ని భరించలేరు " అని ఒక ప్రసిద్ధ నిర్మాత బార్ట్లీని గురించి వ్యాఖ్యానించగా, " అదేం లేదు. నా పనిలో నేను స్ట్రిక్టుగా వుంటాను. తొమ్మిది గంటల కాల్షీటుకు గంట ముందుగా వచ్చి షాట్ కనుక్కుంటాను. సినిమా షూటింగ్ సమయంలో, అందరికీ ఎంతో కొంత ' రెస్ట్ ' దొరుకుతుంది గాని, ఒక్క కెమెరామాన్ కి మాత్రం దొరకదు, బ్రేక్ వేళలో తప్ప. తక్కిన వేళలో ఐదునిముషాలు కూడా కూర్చోడానికి వీలుండదు. నిర్విరామంగా, ఒకటే ధ్యేయంతో పని చెయ్యాలి. అంచేత, నేను సాయంకాలం ఆరుగంటల తర్వాత పని చెయ్యలేను - అత్యవసర పరిస్థితి ఏర్పడితే తప్ప. అలాగే ప్లాన్ చేస్తాను కూడా. అది స్ట్రిక్టు అనిపించుకుంటే నేనేం చెయ్యలేను " అని సమాధానం ఇచ్చారు బార్ట్లీ.

ఆయనకి సెట్లో నిశ్శబ్దంగా వుండాలి. లైట్ మెన్ - " ఆ లైటు వెయ్యి, ఈ లైటు వెయ్యి " అని గట్టిగా అరవకూడదు. ఆయన కూడా చాలా సైలెంట్ గానే చెప్పి లైట్లు ఏర్పాటు చేయిస్తారు. తనకి తృప్తిగా వచ్చేవరకూ షాటు ఏర్పాటు చేస్తారు. అడావుడీ, అర్జెంటూ ఆయనకి పనికి రావు. " పర్ఫెక్షన్ రావడానికి కొంత టైము పడుతుంది. దాని వల్ల నేను " స్లో " అనీ, " నిదానం " అనీ బయటివాళ్ళు చెప్పుకుంటారు. ఏరోజు ప్లాన్ చేసిన దృశ్యాలు ఆ రోజు, ఆ కాల్షీట్లో పూర్తి అవుతాయి. ఇంక స్లో ఏముంది?" అని అడిగారు బార్ట్లీ ఒకసారి.

ఆయనకి, ఇంటర్వ్యూలు, కబుర్లూ పనికిరావు. పెద్ద మొహమాటం మీద ఒకసారి ఒక జర్నలిష్టుకి ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఫలానా టైముకి, ఫలానా చోటికి రమ్మన్నారు. జర్నలిష్టు వెళితే ఆయన పూర్తిగా పనిలో వుండిపోయి - " కుదరలేదు, నేను రమ్మని చెప్పి, మాట నిలబెట్టుకోలేకపోయాను. అంచేతే నేనే మీదగ్గరకు రేపు వస్తాను. ఎక్కడికి రమ్మంటారో, ఎప్పుడు రమ్మంటారో చెప్పండి " అని బార్ట్లీ చెబుతే, ఆ జర్నలిష్టు ఆయన సహృదయానికి విస్తుపోయాడు.

బార్ట్లీ సాధారణంగా ఆదివారాలు పనిచేసేవారు కాదు. ఐతే, అది విశ్రాంతి దినం కూడా కాదు. ఆయన కెమేరాలు " సర్వీస్ " చేసేవారు. అన్ని స్టూడియోల్లో వున్న కెమెరాలూ, లెన్సులతో సహా ఎక్కువగా ఆయన దగ్గరికే సర్వీస్ కు వచ్చేవి. ఇప్పుడుకూడా బార్ట్లీ కుమారుడు ఆ సర్వీస్ ని, నిర్వహిస్తున్నారు.

" కలర్ చిత్రంలో చందమామను ఇంకా బాగా చూపించవచ్చును. వెన్నెలే వస్తుంది గాని రంగులు రావు " అని చెప్పారు బార్ట్లీ. ఆయన తొలి కలర్ చిత్రం మళయాళంలో వచ్చిన " చెమ్మీన్ " (66) అందులోని ఆ బెస్తవారి వాతావరణం, సముద్రం, అతిసహజంగా చూపించారు ఆయన. " చెమ్మీన్ " కి అవార్డులు, ప్రఖ్యాతీ రావడానికి బార్ట్లీ కృషి ఎంతగానో తోడ్పడింది " అని ఆ చిత్ర దర్శకుడు రాము కారియట్ ఒక సందర్భంలో రాసారు. ఆ చిత్రానికే ఆ సంవత్సరం జాతీయ ఉత్తమ (స్వర్ణపతకం) బహుమతి లభించింది. విజయ చిత్రాలు కాక, ఎన్ టీఆర్ సొంత చిత్రాలు " శ్రీకృష్ణసత్య(71), కులగౌరవం ' (72) మొదలయిన తక్కువ చిత్రాలకే ఆయన పని చేశారు. " శాంతినిలయం " (69) అనే తమిళ చిత్రానికి బార్ట్లీకి ఉత్తమ ఛాయాగ్రాహకుడుగా జాతీయ బహుమతి లభించింది.

మార్కస్ బార్ట్లీ " వెన్నెల (తెర) వేలుపు " మాత్రమే కాదు, తాంత్రిక ఛాయాగ్రాహకుడే కాదు - ఇంకా ఎన్నో ప్రయోగాలు చేసినవారు, చూపినవారూ. " పాతాళభైరవి " పాటల్లోని వెలుగుల చిత్రాలకి ఫ్రేము కట్టించుకోవాలనిపిస్తుంది " అంటారు కళాప్రియులు. ఆ చిత్రంలోని చివరి దృశ్యంలో " మాయామహల్ " నిజంగా ఎగిరినట్టుగానే భ్రాంతి కల్పించారు బార్ట్లీ. అది నేల కదలని సెట్టు. అలాగే " పెళ్ళి చేసి చూడు " లో హీరో పిచ్చి నటిస్తూ మంచం మీద కూచుని, కారు నడిపినట్టు నటిస్తే కదలకుండానే ఆ మంచం కెమెరా మూవ్ మెంటుతో నడిచినట్టు అనిపిస్తుంది. " చంద్రహారం " ఆహ్లాదం చెప్పనవసరం లేదు. భారత దేశానికి టెలివిజన్ గురించి ఏ మాత్రం తెలియని రోజుల్లో, ఆ చిత్రంలోని " కలువలు - చంద్రుడు " నాట్యాన్ని బిబిసి టెలివిజన్, వారి దేశంలో ప్రసారం చేసింది.

" మాయాబజార్ " సరే సరి! చిన్న శశిరేఖ - పెద్ద శశిరేఖగా మారే దృశ్యంలో ఒకే షాటులో నీటి అలల్ని చూపించి - తిరిగి కెమెరా పాన్ చెయ్యగా శశిరేఖ పెద్దదై కనిపిస్తుంది. అలాగే " లాహిరి లాహిరి " పాటలో కొంత పగలు తీసిన ఔట్ డోరు, కొంత సెట్టు, కొంత బాక్ ప్రొజెక్షనూ అన్నీ కలిసి రెల్లు దుబ్బుల మీద వెన్నెలతో - ఒకేచోట ఒకేసారి తీసిన భ్రాంతి కలిపిస్తాయి. ఎక్కడా లైటింగులో తెడా వుండదు! ఆ చిత్రంలోని ట్రిక్స్ బార్ట్లీ ప్రతిభని మరీ చాటిచెబుతాయి. ముఖ్యంగా శర్మ, శాస్త్రి కూర్చున్న తివాసీ (గింబళి) రెండువేపుల నుంచీ ముందుకు చుట్టుకోవడం అద్భుతమయిన ఫీటు. ఆ షాటు ఎలా తీసివుంటారో - ఇప్పటికీ టెక్నీషియన్లకు పెద్ద ప్రశ్న. బార్ట్లీ దగ్గర శిక్షణ పొందిన - పెద్దమనుషులు, బంగారుపాప (54), రాజమకుటం (60) చిత్రాలకు ఛాయాగ్రహణం నిర్వహించిన బి.ఎన్.కొండారెడ్డి (బి.ఎన్.రెడ్డి, నాగిరెడ్డిల సోదరుడు) మార్కస్ బార్ట్లీ దక్షిణ చిత్ర పరిశ్రమకి " గొప్ప ఎస్సెట్ " అని చెబుతూ వుంటారు. పలు హిందీ చిత్రాల ద్వారా కూడా తన ప్రతిష్ఠను దేశంలో పరుచుకున్న బార్ట్లీ " ఏమిటో మీ మాయా " అనిపిస్తారు " వెన్నెలరాజుని " చూసినప్పుడల్లా.